ఆంద్రప్రదేశ్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 18 :
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సీఎం జగన్‌పై దాడి కేసులో ఏ1గా ఉన్న సతీష్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అంతకుముందు బయటకొచ్చిన సతీష్ రిమాండ్ రిపోర్ట్ హాట్ టాపిక్‌గా మారింది. సీఎంను అంతమొందించాలన్న ఉద్దేశంతోనే దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు పోలీసులు. అదును చూసి సున్నితమైన తలభాగంలోనే కుట్ర ప్రకారం దాడి జరిగిందన్నారు. దాడి కోసం నిందితుడు కాంక్రీట్ రాయి వాడాడని తెలిపారు. ఏ2గా ఉన్న దుర్గారావు ప్రోద్భలంతోనే ఏ1 నిందితుడు సతీష్ దాడి చేసినట్లు స్పష్టం చేశారు. ఇక కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించినట్లు పేర్కొన్నారు. 17 నే నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్ చేసి సెల్‌ఫోన్ సీజ్ చేశామన్న పోలీసులు.. అన్ని విధాలా విచారణ జరిపి తర్వాతే అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు.