Rr News Telangana
పెద్దపల్లి

పార్లమెంట్ బరిలో కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :


పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేయనున్నారు. గత కొన్ని రోజులుగా పార్లమెంటు బరిలో కారు పార్టీ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లలో ఒకరు పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. మంగళవారం ప్రస్తుత ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను బరిలో దించాలని నిర్ణయించారు. పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధినేత కేసీఆర్ కొప్పుల ఈశ్వర్ కు సమాచారం అందించారు. సీపీఐ ఎంఎల్ నుండి టీడీపీలో చేరిన అనంతరం కొప్పుల ఈశ్వర్ మొదటిసారిగా 1994లో మేడారం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు.
2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రారంభించిన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కొప్పుల ఈశ్వర్ 2004లో మేడారం అసెంబ్లీ స్థానం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 మేడారం, 2009, 2010లో ధర్మపురి నుండి వరుసగా విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం 2014లో విజయం సాధించి ప్రభుత్వ చీఫ్ విప్ గా చేశారు. 2018లో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. విశేష రాజకీయ అనుభవంతో పాటు సింగరేణి కార్మికుల్లో మంచిపట్టున్న కొప్పుల ఈశ్వర్ ను బరిలోకి దించితే పెద్దపల్లి పార్లమెంట్ లో గులాబీ జెండా ఎగరవేయవచ్చని అధినేత కేసీఆర్ భావించి ఈశ్వర్ అభ్యర్థిత్వానికి లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది. అధినేత నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో కొప్పుల ఈశ్వర్ నూతన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పార్లమెంటు పరిధిలో జరిగిన సన్నాహక సమావేశాల్లో పాల్గొని కార్యకర్తలకు ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థిగా ఖరారు కావడంతో మిగతా పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. ప్రస్తుత ఎంపీ వెంకటేష్ నేతకు కాంగ్రెస్ టికెట్ దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఆయనతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీ, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ సుగుణ కుమారి, గోమాస శ్రీనివాస్, గజ్జల కాంతం, అసంపల్లి శ్రీనివాస్, ఊట్ల వరప్రసాద్, శ్యాం, సందీప్ లతో పలువురు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ బలమైన అభ్యర్థి కోసం వేట ప్రారంభించింది. తాజా పరిణామాలతో పెద్దపల్లి పార్లమెంటు పోరు రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group