మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 22 :
అనుమతుల్లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తూ రియల్టర్లు అమాయకులను మోసం చేస్తున్నారు. వెంచర్‌కు డీటీసీపీ అనుమతులున్నాయంటూ, తక్కువ రేటు అంటూ కొనుగోలుదారులకు ప్లాట్లు అంటగడుతున్నారు. మెట్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో పదుల సంఖ్యలో అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. ప్లాట్లు కొన్న సామాన్యులు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. అధికారుల కళ్ల ముందే అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రియల్టర్లు రెచ్చిపోతున్నారు. మెట్ పల్లి పట్టణం ఏటేటా విస్తరిస్తోంది. దీన్ని ఆసరా చేసుకొని మున్సిపల్ పరిధిలో అక్రమ వెంచర్లు యథేచ్చగా వెలుస్తున్నాయి. ఇళ్ల ప్లాట్లకు వస్తున్న డిమాండ్ నేపథ్యంలో రియల్టర్లు ఎలాంటి నిబంధనలు పాటించకుండా వెంచర్లు చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. కొత్త మున్సిపల్ చట్టానికి సైతం రియల్టర్లు, వారికి అండగా ఉండే అధికారులు తూట్లు పొడుస్తున్నారు. అరచేతిలో స్వర్గాన్ని చూపుతూ రియల్టర్లు కొనుగోలుదారులకు ప్లాట్లు విక్రయిస్తున్నారు. తీరా కొన్న తరువాత వెంచర్‌కు అనుమతి లేదని తెలుసుకొని వారు ఆవేదన చెందుతున్నారు. రియల్టర్లు చెప్పేది ఒకటి చేసేది మరోటిలా ఉంది. వెంచర్‌కు డీటీసీపీ వంటి సంస్థల అనుమతులు తీసుకున్నామని, అన్ని అనుమతులు ఉన్న ప్లాట్లు తక్కువ ధరకే విక్రయిస్తున్నా మంటూ నమ్మబలుకు తున్నారు. ఇల్లు కట్టుకుంటే బ్యాంక్ లోన్ వస్తుందని చెబుతున్నారు. ప్లాట్లకు ఎల్లారెస్ వంటి చార్జీలేవీ కట్టన వసరం లేదని, రోడ్లు, నీటి వసతి, కరెంటు సదుపాయం వంటిని అన్నీ తామే కల్పిస్తామని చెప్పి బుట్టలో వేసుకుంటున్నారు. మున్సిపల్ అధికారులకు తెలియకుండానే ఈ తతంగం నడుస్తోందా.? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణ ప్రణాళిక అధికారులను మేనేజ్ చేస్తే ఏమైనా చేసుకోవచ్చన్న ధీమాతో రియల్టర్లు వ్యవహరిస్తున్నారు. మెట్ పల్లి పట్టణంలోని 7 వార్డులో ఇటీవల ఓ కొత్త వెంచర్ వెలిసింది. అయితే ఈ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకొని డెవలప్ చేస్తున్నారు. దీనికి టౌన్ ప్లానింగ్ అనుమతి సైతం రాలేదు. వివిధ స్థాయిల్లో రియల్టర్లు ముడుపులు ముట్టజెపు తుండటం వల్లే అన్ని పనులు చేసుకుపోతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇదొక్కటే కాదు.. మెట్ పల్లి మున్సిపల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అనేక వెంచర్లు వెలుస్తున్నాయి. పేరుకు డీటీసీపీ లేఅవుట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే డీటీసీపీ నిబంధనల మేరకు వెంచర్లలో కల్పించాల్సిన సదుపాయలు మాత్రం కల్పించడం లేదు. డీటీసీపీ పేరు చెప్పుకొని అభివృద్ధి పనులు చేపట్ట కుండానే ప్లాట్ల విక్రయాలు చేస్తున్నారు. అసలైతే డీటీసీపీ నిబంధనల ప్రకారం వెంచర్లు లేవు. నామ్‌కే వాస్తేగా రోడ్లు వేసి చేతులు దులుపుకుంటున్నారు. మెట్ పల్లిలోని ఒకటి, రెండు తప్ప మిగతా పదుల సంఖ్యలోని వెంచర్లలో వాటర్ ట్యాంకు, సెప్టిక్ ట్యాంకులు సైతం నిర్మించలేదు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు, పాలకవర్గం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
నిబంధనలకు తూట్లు….
వెంచర్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక మెట్ పల్లి మున్సిపల్ పరిధిలో వ్యవసాయ భూముల్లో సిమెంటు పలకలతో ప్రహరీ నిర్మిస్తున్నారు. సాగు భూముల్లో రోడ్లు వేసి, ప్రహరీలు కడుతున్నా మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం అంతుపట్టడం లేదు. సాగు భూములను విధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదు. ఒక వేళ వెంచర్లు చేస్తే నిబంధన పాటించాలి. అధికారులు కార్యాలయాలకే పరిమితమై అడ్డదారి పనులకు ఊతమిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. వ్యవసాయ భూముల్లో శాశ్వత నిర్మాణలకు అనుమతి లేదు. రియలెస్టేట్ వ్యాపారులు కంకర, తారు రోడ్లు వేస్తున్నారు. గుంట నుంచి ఐదు గుంటలకు యూనిట్ చొప్పున ఫెన్సింగ్ వేసి గుంటకు రూ.7 లక్షల నుంచి రూ.15 లక్షలకు విక్రయిస్తున్నారు. ఎకరం భూమి కోటిన్నర నుంచి రెండు కోట్లకు కొని ఫామ్‌ల్యాండ్ చేసి నాలుగు నుంచి ఐదు కోట్లకు అమ్ముతున్నారు. ఈ దందాలో రైతులు నష్టపోతుండగా, రియల్ వ్యాపారులు కోట్లకు పడగలెత్తుతున్నారు.
అనుమతి లేని వెంచర్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం : టి. మోహన్ మున్సిపల్ కమిషనర్
అనుమతి లేని వెంచర్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయనికి నోటీసులు పంపినము. 7వ వార్డులో వెలిసిన వెంచర్ గురించి నా దృష్టికి రాలేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కొత్త మున్సిపల్ చట్టం, డీటీసీపీ నిబంధనల మేరకే వెంచర్లో అభివృద్ధి పనులు చేయాలి. రూల్స్ పాటించని వెంచర్లపై చర్యలు తీసుకుంటాం. అనుమతి లేని వెంచర్లలో ఎవరూ ప్లాట్లు కొనొద్దు.