వికారాబాద్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
ఈ నెల 21న నిర్వహించే రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమానికి జిల్లాలో అధికారులందరు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా అధికారుల నిర్దేశించి మాట్లాడుతూ… ఫిబ్రవరి 21న కోస్గి మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు.
రోడ్లు భవనాలు, నీటిపారుదల, మిషన్ భగీరథ, ఎస్సీ, ఎస్టీ విభాగాల అధికారులతో సంక్షేమ శాఖలకు సంబంధించిన అధికారులు స్పష్టమైన సమాచారాలతో ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధించిన శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన తెలిపారు. ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, లింగ్యానాయక్ లు ప్రజల నుండి 129దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో అధికంగా రెవెన్యూ సమస్యలపై అర్జీలు రాగా పెన్షన్లు, భూమి కొలతలు, వ్యవసాయ, పంచాయతీ సమస్యలపై అర్జీలు వచ్చాయి. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.